పర్వతగిరి (గీసుగొండ), వెలుగు : మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. ఈ వివాదం కాస్తా ముదిరి ఆదివారం ధర్నాకు దిగే వరకు వెళ్లింది. వరంగల్ జిల్లా గీసుగొండకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు ఇటీవల దుర్గాదేవి విగ్రహాన్ని ఇప్పించాడు. దీంతో మంత్రి కొండా సురేఖతో పాటు ఇతర కాంగ్రెస్ నేతల ఫొటోలతో రూపొందించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
ఈ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆదివారం ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇందులో రేవూరి వర్గం వారికి గాయాలు కావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొండా వర్గీయులతో పాటు కొందరు మాలధారులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. విషయం తెలుసుకున్న కొండా సురేఖ అనుచరులు వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారిపై ధర్మారం రైల్వే గేటు వద్ద ధర్నా చేపట్టారు.
సుమారు గంట పాటు ధర్నా కొనసాగింది. ఈ నేపథ్యంలో పోలీసులు, కొండా అనుచరుల మధ్య గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ సంఘటనాస్థలానికి చేరుకొని ధర్నా చేస్తున్న వారికి నచ్చజెప్పింది. అక్కడి నుంచి గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని వివరాలు తెలుసుకున్న అనంతరం తమ వర్గీయులను విడిచి పెట్టాలని పోలీసులకు సూచించింది.
వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా గీసుగొండ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి గొడవకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఒకే పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఘర్షణ వాతావారణం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా పిట్టల అనిల్ ఫిర్యాదుతో బండి రాజ్‌కుమార్, ఎం.సురేశ్ రాజు, సీహెచ్.రంజిత్, శివ, వంశీ, రాజ్‌కుమార్, మహేశ్వర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.